ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండ్రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటన రెండో రోజున ముర్ము తాను బాల్యంలో చదువుకున్న పాఠశాలను సందర్శించారు. భువనేశ్వర్‌లో తాను చదువుకున్న ఖండగిరి (భువనేశ్వర్) పరిధిలోని బాలికోన్నత పాఠశాలకు వెళ్లారు. అక్కడ తాను 1970 నుంచి 1974 వరకు 8వ తరగతి నుంచి 11 వరకు చదువుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉన్న తపోబన్, కుంతలకుమారీ ఆదివాసీ ఆశ్రమ పాఠశాలలను ఆమె సందర్శించారు. బాలబాలికలతో ముచ్చటించారు. తనతో కలిసి చదువుకున్న 13 మంది స్నేహితురాళ్లను కలుసుకొని అలనాటి స్మృతులు నెమరు వేసుకున్నారు. బాల్యంలో తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన మయూర్‌భంజ్ జిల్లా ఉపరబెడ గ్రామ పాఠశాలలో కనీస సౌకర్యాలు ఉండేవి కాదని, పెచ్చులూడిన నేలపై తాను ఆవుపేడతో అలికి కూర్చొని చదువుకున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.
గిరిజన కుటుంబంలో జన్మించిన తనను చదివించడానికి నాన్నమ్మ అన్నివిధాలా ప్రోత్సహించారని అక్కడి బాలికలతో రాష్ట్రపతి అన్నారు. అప్పట్లో చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, బాలబాలికలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ద్రౌపదీ ముర్మ మధ్యాహ్నం 1.30 గంటలకు దిల్లీ ప్రయాణమయ్యారు.