ఒడిశాలో రెండ్రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భువనేశ్వర్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం వాయుసేన ప్రత్యేక విమానంలో బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు ఒడిశా రాష్ట్ర గవర్నర్ గణేశీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయుధదళాల నుంచి ఆమె గౌరవవందనం స్వీకరించారు.
అక్కడి నుంచి రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్లో నేరుగా పూరీ క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయానికి కాన్వాయ్‌లో బయల్దేరారు. కొంత దూరం వెళ్లాక బొడొదండో ప్రాంతంలో కాన్వాయ్‌ని ఆపిన రాష్ట్రపతి.. అక్కడి నుంచి కాలినడక ఆలయానికి వెళ్లారు. దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకున్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు. ఆమెకు స్వాగతం పలికిన చిన్నారులను పలకరించారు. ఆమె వెంట కేంద్ర మంకుత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఉన్నారు. దాదాపు గంట పాటు ఆమె ఆలయ సన్నిధిలో గడిపి ప్రత్యేక పూజలు చేశారు.