లిక్కర్ స్కామ్..సాయిరెడ్డి బంధువు అరెస్ట్..తమ్ముళ్ళకు ఆయుధం.!

-

దేశ రాజకీయాలని ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే..భారీ ఎత్తున ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఈ స్కామ్‌లో పలువురు ప్రముఖులు ఉన్నారని, తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె కవిత కూడా ఉన్నారని చెప్పి బి‌జే‌పి నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కవిత కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అలాగే ఈ స్కామ్‌కు సంబంధించి ఐటీ, ఈడీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదే క్రమంలో తాజాగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేసిన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇక వీరిలో శరత్..వైసీపీ విజయసాయి రెడ్డి బంధువు. విజయసాయి సొంత అల్లుడు రోహిత్ రెడ్డికి స్వయానా శరత్ అన్న అవుతారు. ఇలా బంధువు కావడంతో విజయసాయిపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎప్పటినుంచో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతల ప్రమేయం ఉందని టి‌డి‌పి ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో సాయిరెడ్డి బంధువు అరెస్ట్ కావడంతో టి‌డి‌పి నేతలు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.

రాష్ట్రంలో అంచలంచెలుగా మద్యం మాఫియా పెంచారనటానికి సాక్ష్యమే శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అని, విజయసాయిరెడ్డి నేతృత్వంలో తయారయ్యే కల్తీ మద్యం తాగే ఎందరో ప్రాణాలు కోల్పోయారని టి‌డి‌పి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వివరణ ఇచ్చారు. శరత్..విజయసాయి రెడ్డి బంధువే అని..కానీ వాళ్ళ వ్యాపార సంస్థ ఈయనకు సంబంధం ఏంటని మీడియాను సజ్జల ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఢిల్లీ, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా పొలిటికల్ వార్ జరుగుతోందని, దానికి ఏపి ప్రభుత్వంకి, వైసీపీకి, విజయసాయిరెడ్డికి ఏమి సంబంధమని అన్నారు. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news