రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమ్ము, కాశ్మీర్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన సాగనుంది. దసరా వేడుకలను భద్రతాబలగాలతో కలిపి జరుపుకోనున్నారు. నేడు లేహ్ లోని సింధు ఘాట్లో సింధు ధర్మన్ పూజలకు హాజరవ్వనున్నారు. సాయంత్రం ఉద్ధంపూర్ లో ఆర్మీ అధికారులతో భేటీ కానున్నారు. అక్టోబర్ 15 దసరా రోజున కార్గిల్ యుద్దవీరులకు నివాళులు అర్పించనున్నారు. ప్రపంచంలో అత్యంత సంక్లిష్ట ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ద్రాస్ లో ఆర్మీ అధికారులు, జవాన్లతో కలిసి దసరా వేడుకలు జరుపుకోనున్నారు. రాష్ట్రపతి గతంలో జూలై 26 కార్గిల్ దివాస్ రోజున కాశ్మీర్ ను సందర్శించి కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు, చైనా కవ్వింపుల మధ్య రామ్ నాథ్ కోవింద్ పర్యటన ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆర్మీలో మరింత ఉత్సాహాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పేందుకు రాష్ట్రపతి పర్యటన సహకరిస్తుందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.