కేజీ రూ. 200 నుంచి రూ. 2 కు పడిపోయిన టమోటా..సంక్షోభంలో అన్నదాత

-

ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత మీరు వినే ఉంటారు. ఇది ఇప్పుడు టమోటాలకు బాగా పనికొస్తుంది. సరిగ్గా రెండు నెలల క్రితం కూరగాయల ప్రపంచంలో టమోటా ఒక వెలుగు వెలగింది. కనీసం దాన్ని టచ్‌ చేయడానికి కూడా సామాన్యుడు భయపడ్డాడు. కేవలం డబ్బున్న వాళ్లకే అన్నట్లు మారిపోయిన టమోటా.. ఇప్పుడు రోడ్డుపక్కన చెత్తకుప్పలో పడిపోయింది. దాని విలువ ఘోరంగా పడిపోయింది. కూలీలను పెట్టి కోసి మార్కెట్‌కు తీసుకురావాడనికి అయిన ఖర్చు కూడా టమోటాను అమ్మడం వల్ల రావడం లేదు. బాక్సులు బాక్సులు రోడ్లపై పడేసి వెళ్లిపోతున్నారు. కేజీ ధర 200 నుంచి రూ. 2లకు పడిపోయింది.

టమోటా వేసిన రైతు సుడితిరిగింది. కొందరు కోటీశ్వరులు అయితే, మరికొందరు లక్షాధికారులు అయ్యారు. టమోటాలకు బాడీగార్డులను కూడా కాపలాగా పెట్టుకున్నారు. టమోటా వ్యాన్లు చోరీలు కూడా చేశారు. అంత రేంజ్‌కు ఎదిగిన టమోటా ఇప్పుడు ఆసాంతం కిందపడింది. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో ఉత్పత్తి పెంచిన రైతులు ఇప్పుడు టమాటా ధర నేల చూపులు చూడటంతో దిగులుపడుతున్నారు.

టమోటాల వల్ల అప్పుడు వినియోగదారులు బాధపడితే.. ఇప్పుడు రైతులు కంటతడిపెడుతున్నారు. మహారాష్ట్రలో టమాటా ధరలు విపరీతంగా పడిపోయాయి. వందలో 99శాతం ధర పడిపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. గత నెలలో కిలో రూ.200 కంటే ఎక్కువ విక్రయించారు. కాని ఇప్పుడు పరిస్తితి పూర్తిగా మారిపోయింది. కిలో టమాటా ధర రూ.3 నుంచి 5 వరకే పలుకుతోంది.

కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో చాలా మంది రైతులు తమ పంటలను నాశనం చేస్తున్నారు. టమాటాల్ని మార్కెట్‌కి తరలించే ఖర్చు కూడా రావడం లేదని పొలాల్లోనే వదిలేస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ వంటి ప్రాంతాల్లో రైతులు ముఖ్యంగా టమాటాలు, ఉల్లిపాయలు వంటి నిత్యావసర పంటలు సాగు చేస్తారు. టమాటా ధర పడిపోవడంతో రైతుల ఖర్చుల వరకైనా వచ్చేలా కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

చాలా మంది రైతులు టమాటా ఉత్పత్తులను విక్రయించగలిగినప్పటికీ, అతి తక్కువ ధరలకు కొన్నిసార్లు కిలో రూ.2 కంటే తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఎకరంలో టమాటాలు పండించడానికి ప్రారంభ పెట్టుబడి రూ.2 లక్షలు అవుతుంది. ఇంత తక్కువ ధరకు పంటలు అమ్మడంతో భారీ నష్టాలు వస్తున్నాయి.

పూణె హోల్‌సేల్ మార్కెట్‌లో టమాటా ధరలు కిలోకు రూ.5కి పడిపోవడంతో హోల్‌సేల్ మార్కెట్లలో సైతం తీవ్ర సంక్షోభంలో పడింది. పిపాల్‌గావ్, నాసిక్, లాసల్‌గావ్ వంటి ప్రముఖ మార్కెట్‌లలో సగటు హోల్‌సేల్ ధరలు గత ఆరు వారాలలో ఒక క్రేట్ (20 కిలోలు) రూ.2,000 నుంచి రూ.90కి చేరింది.

కొల్హాపూర్‌లోని రిటైల్ మార్కెట్‌లలో ఇప్పుడు టమాట ధర కిలోకు రూ. 2 నుంచి రూ.3 వరకు పలుకుతున్నాయి. క్షీణిస్తున్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో పూణే జిల్లాలోని జున్నార్, అంబేగావ్ తహసీల్‌లలో రైతులు టమాట సాగును పూర్తిగా నిలిపివేశారు.

ఈ సంక్షోభానికి మూలం అధిక ఉత్పత్తి. నాసిక్ జిల్లాలో సాధారణంగా 17,000 హెక్టార్లలో టమాట సాగు చేస్తారు. మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ డేటా చెప్తోంది. అయితే ఈ ఏడాది 35,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగి 12.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.. రూ.100కు ఆరు కేజీల టమోటాలను విక్రయిస్తున్నారు. టమోటా పంట వేసిన రైతులు ఇప్పుడు నష్టాలను చవిచూడక తప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version