మన దేశంలో ప్రభుత్వ హాస్పిటళ్లు, వాటిల్లో ఉండే ల్యాబ్‌లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనుకుంటే పొరపాటు. ఎందుకంటే నోయిడాలో ఓ ప్రైవేటు ల్యాబ్ కూడా పేషెంట్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది. కరోనా లేకున్నా.. ఉందని చెప్పి తప్పుడు రిపోర్టులు ఇచ్చింది. దీంతో వారు కరోనా ఉందని అనుకుంటూ చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆ ల్యాబ్ నిర్వాకం బయటపడింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న గౌతం బుద్ధ నగర్‌కు చెందిన 35 మంది పేషెంట్లు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఓ ప్రైవేటు ల్యాబ్‌లో టెస్టులు చేయించుకున్నారు. అయితే ఆ ల్యాబ్ నిర్వాహకులు వారి నుంచి పెద్ద మొత్తంలో కరోనా టెస్టులకు ఫీజులను అయితే వసూలు చేశారు కానీ.. పరీక్షలు సరిగ్గా చేయడంలో విఫలమయ్యారు. వారికి కరోనా ఉందని రిపోర్టు ఇచ్చారు. దీంతో ఆ పేషెంట్లు సమీపంలోని ప్రభుత్వ కోవిడ్ 19 చికిత్సా కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక వైద్యులకు అనుమానం వచ్చింది. దీంతో వారు మళ్లీ ఆ పేషెంట్లకు కరోనా టెస్టులు చేశారు. వారి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు చేయగా.. వారికి కరోనా లేదని తేలింది.
అయితే అప్పటికే ఆ కోవిడ్ 19 చికిత్సా కేంద్రంలో ఆ 35 మంది 3 రోజుల నుంచి ఉండడంతో వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. వారికి కరోనా వార్డులో ఉండడం వల్ల ఆ వైరస్ వ్యాపించి ఉండవచ్చుననే అనుమానంతో వైద్యులు వారిని క్వారంటైన్ చేశారు. కాగా ఆ పేషెంట్లకు కరోనా ఉందని చెప్పి తప్పుడు రిపోర్టు ఇచ్చిన సదరు ప్రైవేటు ల్యాబ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.