ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై బాలీవుడ్ నటి, యునిసెఫ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మహిళల కష్టాలను తీర్చేందుకు మంచి పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలోని మహిళలు, పిల్లల జీవితాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని ప్రియాంక చోప్రా అన్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ గమనించిన విషయాలనే తాన చెబుతున్నానని ప్రియాంక వివరించారు.
అమెరికా గాయకుడు, నటుడు నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిలయిన ప్రియాంక చోప్రా చాలాకాలం తర్వాత ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
యునిసెఫ్ కు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా ప్రియాంక ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవడానికి గ్రామాలను కూడా సందర్శిస్తున్నారు. రాష్ట్రంలోని ఓ అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం స్కూలుకు వెళ్లే బాలికల సంఖ్య పెరిగింది.. పిల్లలకు పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం.. పిల్లల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమిది.. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది’ అంటూ ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.