ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాత కక్షల నేపథ్యంలో వైసీపీ నేత పసుపులేటి రవితేజను లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేసిన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సింగరాయకొండలో బాధితుడి తరఫున బంధువులు నిరసనకు దిగారు.
హత్యకు ఉపయోగించిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని సింగరాయకొండ పోలీసుస్టేషన్‌లో ఉంచారు. హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న వ్యక్తుల్లో కొందరు పోలీసుస్టేషన్ గోడ దూకి వెళ్లి లారీకి నిప్పంటించారు. గమనించిన పోలీసులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. అంతటితో ఆగకుండా ఆందోళనకారులు పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న చలివేంద్రాన్ని తగులబెట్టారు.
పట్టణంలోని దుకాణాలను మూసివేయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఒంగోలు నుంచి వచ్చిన పోలీసు బలగాలు సింగరాయకొండలో మోహరించారు. డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సీఐ లక్ష్మణ్, ఎస్సై ఫిరోజా ఫాతిమా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.