ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. మే 1 వరకు లాక్‌డౌన్ పొడిగింపు..!!

-

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం వ్యాప్తిచెందింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు చాచింది. ఇక ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా 16 లక్షలకుపైగా కేసులు ఉండగా కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 90 వేలను మించిపోయింది.

అయితే భార‌త్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. ఇక్క‌డ కూడా క‌రోనా కేసుల సంఖ్య, మ‌ర‌ణాల‌ పెరుగుతూ వ‌స్తోంది. కరోనా రక్కసిని ఎదుర్కోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం అనేక రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే క‌రోనా రోజురోజుకు విజృంభిస్తుండ‌డంతో పంజాబ్‌లో మే 1వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తదుపరి ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14తో పూర్తవుతుంది.

పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాలు సంభవిస్తుండడంతో లాక్ డౌన్ పొడిగించాలని రాష్ట్రాలే కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగించింది. ఇక ఒడిశా తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించిన రెండో రాష్ట్రం పంజాబ్ కావడం గమనార్హం. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే మే 1వరకూ లాక్‌డౌన్ అమలు చేయక తప్పదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. కాగా, పంజాబ్ లో ఇప్పటివరకు 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news