ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కోచ్ పార్క్ టే సాంగ్‌తో తెగదెంపులు చేసుకుంది. నాలుగేళ్ల గురుశిష్యుల బంధానికి శుక్రవారం తెరపడింది. కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు శుక్రవారం రోజున పార్క్ తెలిపాడు. ఇటీవలి కాలంలో సింధు నిరాశజనక ప్రదర్శనకు తానే బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పాడు.
‘సింధుతో నా అనుబంధం గురించి చాలామంది అడుగుతున్నారు. ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో ఆమె నిరాశపరిచింది. కోచ్‌గా అందుకు నేను బాధ్యత వహిస్తున్నా. ఆమె మార్పు కోరుకుంది. కొత్త కోచ్‌ను వెతుక్కుంటానని చెప్పింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నా. వచ్చే ఒలింపిక్స్ వరకు సింధుతో ఉండలేకపోతున్నందుకు క్షమించండి. కానీ దూరం నుంచి ఆమెకు మద్దతు తెలుపుతా’’’ అని పార్క్ పేర్కొన్నాడు.
2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ – సింధు ప్రయాణం మొదలైంది. మొదట్లో అతడిని మెన్స్ సింగిల్స్ కోచ్‌గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినా.. తర్వాత సింధు పర్సనల్ కోచ్‌గా మారాడు. పార్క్ కోచింగ్ శిక్షణలో సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను ముద్దాడింది.