తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో గ్రూపు1 పరీక్ష రెండు సార్లు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పేపర్ లీకేజ్ కారణంగా ఒకసారి, బయోమెట్రిక్ నిర్వహించలేదనే కారణంగా మరోసారి గ్రూపు 1 పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే.గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని నిరుద్యోగులు నోరు పోయేలా మొత్తుకున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. నిరుద్యోగుల డిమాండ్‌ను పక్కకు పెట్టి చివరకు 1:50 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ.
ఏండ్లకు ఏండ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన అభ్యర్థుల్లో చాలా మంది గ్రూప్-1 మెయిన్స్‌కు దూరమయ్యారు. అలాంటి అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉద్యోగ నియమాకాల్లో ఎలాంటి రూల్స్ మార్చమని చెప్పి, నిరుద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు నిరుద్యోగుల కన్నీటికి కారణమైందంటూ బోరున విలపిస్తున్నారు. మా చావును చూసుకునేందుకే మేం ఒక ప్రభుత్వాన్ని మార్చామా..? అని వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పుడు మేం ఏ చెట్టుకు ఉరి పెట్టుకోవాలి అంటూ రేవంత్ సర్కార్‌ను నిలదీస్తున్నారు.