స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఒకవైపు విచారణ జరుగుతుంటే, అదే అంశంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. ఏదోరకంగా గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు నోటికి వచ్చినట్లు జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అసలు అవినీతి అన్నది జరగకపోయినప్పటికీ, ఏదో జరిగిపోయినట్లు మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి, 3 లక్షల 80 వేల మందికి పైగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను ఇచ్చేందుకు సీమెన్స్ అనే బహుళ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుందని, ఈ లెక్కన ప్రతి విద్యార్థిపై 9, 000 రూపాయలను మాత్రమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు.
అమ్మ ఒడి, విద్యా దీవెన, తలలో దువ్వెన వంటి పథకాల ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు కంటే, గత ప్రభుత్వం చేసింది చాలా సాధారణమైన ఖర్చు అని, నైపుణ్య శిక్షణ తరగతుల ద్వారా రాష్ట్రంలోని 3 లక్షల 80 వేల మంది విద్యార్థులు శిక్షణ పొంది, సర్టిఫికెట్లను అందుకున్నారని, అవేమీ దొంగ సర్టిఫికెట్లు కాదు, తమకు తాము ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లుగా చెప్పుకునే సర్టిఫికెట్లు కాదని అన్నారు. నైపుణ్య శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన వారు ఏ, ఏ అంశాలలో శిక్షణ పొందారో సవివరంగా వివరిస్తూ అందజేసిన ధ్రువీకరణ పత్రాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణా తరగతులను నిర్వహించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వమే ఆ సర్టిఫికెట్లను జారీ చేసిందని, ఈ ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించిందే లేదని, నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించకుండానే, ధ్రువీకరణ పత్రాలను ఈ ప్రభుత్వం ఎలా అందజేసిందని, అంటే గత ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించారని విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు.