భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా పరిమిత ఓవర్ల జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. భారత్ శ్రీలంకలో జూలైలో ఆడనున్న టీ20లు, వన్డేలకు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పనిచేయనున్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్‌లో కోహ్లి నాయకత్వంలో టెస్టు టీమ్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో ఆ జట్టుకు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పనిచేయనున్నాడు.
జూలై 13 నుంచి 27 తేదీల మధ్య శ్రీలంకతో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉండనున్నాడు. ఆ సిరీస్‌లకు భారత జట్టును ఈనెల తరువాత ప్రకటించనున్నారు. ఇక రవిశాస్త్రి వెంటే సహాయక సిబ్బంది అందరూ వెళ్లనున్నారు కనుక ద్రావిడ్ తన సొంత సిబ్బందితో శ్రీలంకకు వెళ్లనున్నాడు. మరోవైపు భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. అంతకు ముందు జూన్‌లో ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను ఆడనుంది. ఆ రెండు సిరీస్‌లకు టెస్టు టీమ్‌కు కోచ్‌గా రవిశాస్త్రి వ్యవహరించనున్నాడు.
కాగా ద్రావిడ్ 2014లో టీమిండియా ఇంగ్లండ్ టూర్లో భారత్‌కు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. ద్రావిడ్ శిక్షణలో అండర్ 19, ఇండియా ఎ టీమ్‌లకు చెందిన ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుండడం విశేషం. అలాగే ద్రావిడ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ద్రావిడ్‌ను భారత యువ జట్టుకు కోచ్‌గా నియమించడం ఆసక్తి కలిగిస్తోంది. మరి ద్రావిడ్ శిక్షణలో భారత యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి.