ఇండియా-భారత్ వివాదంలో ప్రభుత్వ భయాందోళన కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంలో ‘ఇండియా, అంటే భారత్’ అని ఉందని, అది తనకు పూర్తిగా సంతృప్తికరమేనని చెప్పారు. ఈ వివాదంపై వస్తున్న స్పందనలన్నీ విస్మయంతోకూడినవేనని చెప్పారు. ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టడం అద్భుతమైన ఆలోచన అని తెలిపారు.
భారత్‌కు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న దానికి భిన్నంగా ప్రతిపక్షాలు భిన్న అభిప్రాయం కలిగి ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. భారత్‌కు రష్యాతో పాటు అమెరికాతోను మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తమ దేశానికి ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉండే హక్కు ఉందన్నారు. రాహుల్ ఇంకా మాట్లాడుతూ… జీ20 సదస్సుకు విపక్ష నేతను పిలవకపోవడం, 60 శాతం మందికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వారికి విలువ ఇవ్వకపోవడమే అన్నారు. జీ20 సదస్సు జరగడం మంచి పరిణామమని, కానీ విపక్ష నేత ఖర్గేను పిలవకూడదని వారు నిర్ణయించుకున్నట్లుగా ఉందన్నారు. వారు ఎందుకలా భావిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భారత్‌లో హింస, వివక్ష పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సంస్థలపై పూర్తిస్థాయిలో దాడి జరుగుతోందన్నారు.