అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలిచ్చి రాష్ట్రంలోని పేదప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలని రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రాహుల్ వస్తున్నందున కేటీఆర్ బహిరంగ లేఖను విడుదల చేశారు.
గత పదేళ్లలో ఘననీయంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా బహిరంగ లేఖతో ఒక్కసారి గుర్తు చేయదలచుకున్నానన్నారు. ఆరు గ్యారెంటీలతో ప్రజల గొంతుకోశారని, పిలిస్తే పలుకుతానని పారిపోయిందెవరని, ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నించారు.రైతులు, నిరుద్యోగులు, పోలీసులు, చేనేత కార్మికులు, ఆటోడ్రైవర్లు అందరూ బాధితులేనని, మూసీ, హైడ్రా పేరిట ప్రజలను వంచించారని, దమ్ముంటే వచ్చి ఆ బాధితులను కలవండని, అశోక్ నగర్ నిరుద్యోగులను పలకరించండని సవాల్ చేశారు.