మొత్తానికి రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానుండటంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. వారంలో వరంగల్ లో భారీ సభ నేపథ్యంలో కార్యకర్తల్లో చలనం వస్తోంది. నేతంలంతా ఏకమవుతున్నారు.ఐక్య గళం వినిపిస్తున్నారు అన్న మురిపెం మూన్నాళ్ల ముచ్చటగానే మిగలనుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.రాహుల్ సభ విజయవంతానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న సన్నాహక పర్యటనలు, సభల నేపథ్యంలో మరోసారి సీనియర్లు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. రాహుల్ సభ విజయవంతం చేసిన క్రెడిట్ కొట్టేసేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. అంతే తప్పసభను విజయవంతం చేసేందుకు ఐక్యంగా ముందుకు అడుగులు వేసేందుకు వెనకాముందు ఆడుతుండటమే చర్చనీయాంశంగా మారింది.
రాహుల్ సభ విజయవంతం కోసం వరంగల్ చుట్టుపక్కల జిల్లాల్లో రేవంత్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నల్లగొండలో రేవంత్ పర్యటనకు సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టారు. అంతేగాకుండా రాహుల్ సభ ఒక్కరితో సక్సెస్ కాదంటూ వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. రేవంత్ పర్యటనకు ముందు కూడా ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇంట్లో సీనియర్ నేతలుప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.
తాజాగా కాంగ్రెస్ రాష్ర్ట ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి కూడా కోమటిరెడ్డి గైర్హాజరయ్యారు. ముఖ్యంగా రాహుల్ సభ ముందు నిర్వహించిన ఈ సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మాకొట్టడంపై అధిష్ఠానం ఆరాతీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఒక రకంగా అధిష్టానాన్ని ధిక్కరించడమేనన్న భావనలో నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఏప్రిల్ నెలారంభంలో తనతో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు రాహుల్ గాంధీ సీరియస్ వార్నింగే ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా..విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఈ భేటీ అనంతరమే రాహుల్ పర్యటన ఖరారైంది.
రాహుల్ గాంధీ అంతలా గట్టి వార్నింగ్ ఇచ్చినా… నేతలు మాత్రం తలో రూటు అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి లోనవుతున్నారు. నేతల వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు ఉన్న పరువు కూడా పోతోందని వాపోతున్నారు. బాధ్యతగా మెలగాల్సిన నేతలే ఇలా విభేదాలు రచ్చకెక్కేలా వాదులాడుకుంటే ప్రజలకు విశ్వాసం కలిగేదెలా అని అంటున్నారు. సభకు జనాన్ని తరలించడం కూడా కష్టసాధ్యమేనని చెబుతున్నారు.