ప్రభుత్వాలు ఇస్తున్నంత ప్రాధాన్యం సామాన్య ప్రజలు విద్య విషయమై ఇవ్వడం లేదు. ఎందుకనో వాళ్లు ప్రభుత్వ బడులను పట్టించుకోవడం లేదు. కాన్వెంటు చదువులు చాలా బాగుంటాయి అన్న భ్రమను వీడడం లేదు. ఈ తరుణాన యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ దాస్ తీసుకున్న నిర్ణయాల కారణంగా బడి ఈడు పిల్లలంతా బడిలోనే, ఆ చదువులు కూడా ప్రభుత్వ బడిలోనే అన్న ఆలోచన ఒకటి అమలు కానుంది. ఆ వివరం ఈ కథనంలో…
చదువులు ఎలా ఉన్నాయి అన్న ప్రశ్నకు చాలా జవాబులు ఉన్నాయి. చదువులెల్ల సారము చదివితి తండ్రి అన్న మాట ఒకటి ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య కశిపుడికి చెప్పినంత సులువుగా ఎవ్వరం చెప్పలేం కూడా! బతుకు చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా చదువు కొనసాగించాల్సిందే ! ఎందరో విద్యా దీపాలకు దూరం అవుతున్న వేళ మన పాలకులు కాస్త శ్రద్ధవహిస్తే మంచి ఫలితాలే వస్తాయి. డ్రాపౌట్లూ తగ్గుతారు. ఆ విధంగా మన ప్రభుత్వాలు ఎందుకు అని ఆలోచించవు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలకు పంపరు. ఈ మాట ఎప్పటి నుంచో ఉంది. మరి ! ఇప్పుడు కూడా అదేవిధంగా ఉద్యోగులు కార్పొరేట్ శక్తుల నీడల్లోనే చదువులు కొనసాగింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతా ప్రభుత్వ బడుల్లోనే చదవాలని ఆదేశిస్తున్నారు.
వాస్తవానికి ప్రభుత్వం విద్య కోసం ఎంతో వెచ్చిస్తోంది. క్వాలిఫైడ్ టీచర్ ఉండేది అక్కడే. క్వాలిఫైడ్ టీచర్ కారణంగా క్వాలిటీతో కూడిన విద్య అందాల్సింది అక్కడే ! కానీ మన విద్యా ప్రమాణాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. అందుకే వీటిని కాస్తయినా దూరం చేసే క్రమంలో ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వ బడుల్లోనే అందరూ చదవాలి. అంటే అక్కడ కార్పొరేట్ బడులు ఇకపై ఉండవు అని అర్థం. బాగుంది కానీ ఈ నిర్ణయం అమలు చేయడం నిజంగానే సాహసం.
ఇప్పటికే విద్య ప్రయివేటీకరణ దిశగా వెళ్లింది. మరి! ఈ క్రమంలో ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం ఇచ్చేందుకు, ప్రభుత్వ బడుల ప్రాధాన్యం పెంచేందుకు యోగి తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తాయా ? అదేవిధంగా ఆయన రాష్ట్రంలో అనాథలకు తిండి, బట్టలు, చదువు అందించేందుకు, ఉచితంగా అందించేందుకు కూడా ఆయన ముందుకు వచ్చారు. ఇది కూడా శుభ పరిణామమే. ఇవన్నీ ఆచరణకు నోచుకుంటే మంచి ఫలితాలే ఇస్తాయి. ప్రభుత్వ బడులు తమ వైభవం కోల్పోయి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో మంచి విద్యను అందుకోవాలంటేనే భయపడి పోతున్న తరుణాన కొంతలో కొంతయినా ఇటువంటి చర్యలు తల్లిదండ్రులకు ఉపశమనం. అదేవిధంగా అనాథల విషయమై తీసుకున్న నిర్ణయం కూడా ఎంతో బాగుంది.