రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా రైల్ దృష్టి (raildrishti.org.in ) పేరిట ఓ నూతన వెబ్‌సైట్‌ను ఇవాళ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ రైల్ దృష్టి వెబ్‌సైట్ ను ప్రారంభించారు. ఇందులో ప్రయాణికులు అనేక వివరాలను తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. రైల్ దృష్టి ప్రత్యేకతలు ఇవే…
* భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చిన రైల్ దృష్టి వెబ్‌సైట్ లో ప్రయాణికులు రైళ్ల సమయ వేళలను తెలుసుకోవచ్చు. ప్రయాణికులు ప్రయాణించాలనుకున్న రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
* ఐఆర్‌సీటీసీ కిచెన్ లో వంటలు ఎలా వండుతున్నారు వంటి వివరాలను తెలుసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఆర్‌సీటీసీ కిచెన్లలో అమర్చిన సీసీ కెమెరా దృశ్యాలను లైవ్‌లో చూడవచ్చు. రైళ్లలో ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఆహార పదార్థాల్లో నాణ్యత ఉండడం లేదని ప్రయాణికులు భావిస్తున్న దృష్ట్యా వారికి ఆ అనుమానాలు ఉండకుండా చూసేందుకు గాను ఇలా రైల్ దృష్టి పోర్టల్‌లో లైవ్ స్ట్రీమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ కిచెన్లలో జరిగే వ్యవహారాన్నంతా కెమెరాల్లో చూడవచ్చు. ఆహారం నాణ్యంగా ఉందో, లేదో తెలుసుకోవచ్చు.
* కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ ఫోన్లు.. ఇలా ఏ డివైస్‌లో అయినా ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి చూడవచ్చు.
* రైల్వేకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఈ సైట్‌లో అందిస్తున్నారు.
* త్వరలో ఐఆర్‌సీటీసీ యాప్‌లో రైల్ దృష్టి సేవలను అందివ్వనున్నారు.
* రైలు ఎక్కడ ఉందో లైవ్ లొకేషన్ ట్రాక్ చేయవచ్చు.
* పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
* ప్రయాణికులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా ఈ సైట్‌లో చేయవచ్చు.