పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. ఎన్ని బొమ్మలు కొనిచ్చినా.. వారికి అందులో ఒక బొమ్మ మాత్రం చాలా స్పెషల్. ఆ బొమ్మను ఎవరైనా తీసుకుంటే మాత్రం ఏడిచి నానా అల్లరి చేస్తారు. అలా రైలులో ప్రయాణిస్తున్న ఓ బాలుడు తనతోపాటే బొమ్మను తీసుకెళ్లాడు. రైలు దిగేటప్పుడు ఆ బొమ్మను మరిచి ఇంటికెళ్లిపోయాడు. పిల్లాడు బొమ్మతో సరదాగా ఆడుకోవడం గమనించిన ఇండియన్ ఆర్మీ హవల్దార్ ఆ బొమ్మను ఎలాగైనా ఆ బుడ్డోడి వద్దకు చేర్చాలనుకున్నారు. అందుకోసం ఆయన ఏం చేశారంటే..?
జనవరి 3వ తేదీన సికింద్రాబాద్‌లో అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలు బయలుదేరినప్పటి నుంచీ అద్నాన్ ఆ బొమ్మ ట్రక్కుతో ఆడుకొంటూనే ఉన్నాడు. అదే కోచ్‌లో ఉన్న ఇండియన్ ఆర్మీ హవల్దార్ విభూతిభూషణ్ పట్నాయక్ ఇదంతా గమనిస్తూ వచ్చారు. పశ్చిమబెంగాల్ శివారులోని కిషన్‌గంజ్ (బిహార్) రాగానే అద్నాన్ కుటుంబం రైలు దిగిపోయింది. రైలు కదిలాక.. ఆ చిన్నారి తన బొమ్మను అక్కడే మరిచి దిగిపోయిన విషయాన్ని హవల్దార్ గుర్తించారు. ఎలాగైనా ఆ బొమ్మను తిరిగి అద్నాన్ వద్దకు చేర్చాలని ఆయన ఆరాటపడ్డారు.
వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ ‘139 రైల్ మదద్’కు ఆయన ఈ విషయం చేరవేశారు. ఎమర్జెన్సీ కేసుల కోసం పనిచేసే రైల్వే హెల్ప్‌లైన్ ఓ కుర్రాడి బొమ్మ గురించి శ్రమ తీసుకుంటుందా అనే అనుమానం కలిగింది ఆయనకు. ఇటు రైల్వే అధికారులు సైతం అసాధారణ రీతిలో స్పందించారు. ఓ బృందాన్ని రంగంలోకి దింపి రిజర్వేషను ఛార్టు ఆధారంగా అద్నాన్ కుటుంబం వివరాలు బయటికి తీశారు. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర్ దినాజ్‌పుర్ జిల్లా ఖాజీ గ్రామంలో ఉంటున్న అద్నాన్ తల్లిదండ్రులు మోహిత్ రజా, నస్రీన్ బేగంల ఇంటికి వెళ్లి చిన్నారికి ఆ బొమ్మను అందజేశారు.