తెలంగాణలో ఈరోజు రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర తీరం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దాని ఫలితంగా ఈరోజు, రేపు తెలంగాణలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే నిన్ను కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
మరోవైపు రాష్ట్రంలో చలిపులి ప్రజలను వణికిస్తోంది. అదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అంతేకాకుండా ఉదయాన్నే రహదారులపై పొగమంచు కమ్ముకుంటుంది. ఇక చలి తీవ్రత పెరగడంతో ప్రజలు రాత్రుళ్ళు బయటకు రావాలంటే వణికిపోతున్నారు.