హైదరాబాద్: ఒడిషా సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. చత్తీస్ గఢ్, మహారాష్ట్ర మీదుగా అరేబియా సముద్రం వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రలోనూ పలు చోట్ల ఆది, సోమవారం వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. అంతేకాదు పలు జిల్లాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షం పడుతుందని పేర్కొంది.
నైరుతీ రుతు పవనాలు కూడా రెండు రాష్ట్రాల్లో విస్తరించాయని తెలిపింది. తెలంగాణలో 6 ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక వర్ష పాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని వెల్లడించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా విపత్తు జరిగితే తక్షమే చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరడంతో దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి నది ఉధృతి పెరింగింది.