ఐపీఎల్ 15వ సీజన్ లో నేటి నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభమయ్యాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ ఓడి.. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జోస్ బట్లర్ సమయోచితంగా ఆడి 56 బంతుల్లో 89 పరుగులు చేశాడు. బట్లర్ స్కోరులో 12 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది.
ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (3) అవుట్ కాగా, బట్లర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడిచ్చిన కొన్ని క్యాచ్ లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడవడం కలిసొచ్చింది. బట్లర్ మొదట్లో నిదానంగా ఆడినా, ఆఖర్లో బ్యాట్ ఝుళిపించి స్కోరు పెంచాడు. కెప్టెన్ సంజు శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ 28 పరుగులు సాధించాడు. హెట్మెయర్ 4, పరాగ్ 4 పరుగులు చేసి అవుటయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 1, యశ్ దయాళ్ 1, సాయి కిశోర్ 1, హార్దిక్ పాండ్య 1 వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.