మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఆలోచన చేసి ఎన్నికల్లో ఓటు వేయాలని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలను కోరారు. గురువారం మండల పరిధిలోని పలుగ్రామాలల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా మీ అభివృద్ధి కోసం మీ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ఎన్ని మార్లు కొట్లాడినా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని మీకు మాట ఇచ్చిన..ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు అభివృద్ధి జరగాలి..అందుకే నా రాజీనామా అస్త్రాన్ని సంధించా…దెబ్బకు కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు, ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి మీ కాళ్ళ ముందు మోకరిల్లి అభివృద్ధి చేశారని అన్నారు.
56 సంవత్సరాలు నిజాయితీగా బతికానని.. అబద్ధం ఆడలేదని, మోసం చేయలేదని.. అయినా తననున అమ్ముడుపోయానని బద్నామ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి పోయినా, డబ్బులు పోయినా.. బద్నామ్ చేసినా తనకు బాధ లేదని.. మునుగోడు ప్రజలకు అభివృద్ధి నిధులు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. తన బలగం, బలం.. మునుగోడు ప్రజలేనన్నారు. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి.. చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువస్తే.. ప్రతి పేద మహిళలకు 2500 రూపాయలు వస్తాయన్నారు. 4000 రూపాయల ఆసరా పెన్షన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. వీటితోపాటు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఆయన చెప్పారు.