గొట్టిపాటి, రాపాక‌…. వైసీపీతో డీల్ సెట్ అయ్యిందా…!

-

ఏపీలో విపక్ష పార్టీలు అయిన టిడిపికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అధికార వైసీపీకి దగ్గరయి న‌ట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పార్టీ మారేందుకు వైసీపీకి చెందిన కీలక నేతలతో సీక్రెట్‌గా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గత కొద్ది రోజులుగా టిడిపిలో ఉండాలా ? వైసీపీలోకి వెళ్లాలా ? అన్న విషయంలో ఊగిసలాట ధోరణిలో ఉన్నారు. పూర్వాశ్రమంలో రవి వైసీపీకి చెందిన వ్యక్తే.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత తన వ్యాపార అవసరాల నేపథ్యంలో టిడిపిలోకి జంప్ చేసేశారు. ఇంకా చెప్పాలంటే ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. ఇంకా చెప్పాలంటే బాలినేనికి ఆయ‌న మొన్న ఎన్నిక‌ల్లో కూడా బాగానే అమౌంట్ స‌ర్దుబాటు చేసిన‌ట్టు ప్ర‌చారం ఉంది. వీరిద్ద‌రు గ‌తంలో కాంగ్రెస్ ఉన్న‌ప్పుడు… ఆ త‌ర్వాత వైసీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచే మంచి స్నేహితులు.

ఇక కొద్ది రోజులుగా ర‌వికి చెందిన గ్రానైట్ క్వారీల‌పై వ‌రుస‌గా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మంత్రి బాలినేనితో చెప్పించుకుని తన క్వారీల‌పై దాడులు జరగకుండా చూసుకుంటున్న‌ట్టు టాక్. ఇక ఇటీవల బాలినేని మనవడి పుట్టినరోజు హైదరాబాద్లో జరగగా ఆ వేడుకకు కూడా ఎమ్మెల్యే రవి వెళ్లారు. వారిద్దరి మధ్య అక్క‌డే ర‌వి పార్టీ మార్పు అంశంపై చర్చలు జరిపినట్టు సమాచారం. ర‌విని పార్టీలో చేర్చుకునేందుకు బాలినేని ఆసక్తి చూపుతుంటే… అదే అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి మాత్రం ఈ విషయంలో కొర్రీలు పెడుతున్నట్టు టాక్‌…!

ఇక తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కొద్ది రోజులుగా అసెంబ్లీలోనూ… బయట వైసిపికి సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన తాజాగా గోదావరి జిల్లాల పార్టీ ఇన్చార్జ్, టీటీడీ చైర్మ‌న్‌ వైవీ.సుబ్బారెడ్డిని కలిసినట్టు సమాచారం. ఆయ‌న పార్టీ మారుతున్న‌ట్టు తూర్పు గోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశం ఇప్పుడు టిడిపి, జ‌న‌సేన వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news