వారం రోజుల్లో రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన

-

తెలంగాణలో రేషన్ కార్డు దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి అర్హులైన వారందరికి కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో రేషన్ కార్డుల మంజూరు, వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర కాబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగులో ఉన్న దరఖాస్తులు త్వరితగతిన వెరిఫికేషన్ చేసి జాబితాను వారం రోజుల్లో పంపాలని ఆదేశించారు. మొత్తం రేషన్ కార్డుల మంజూరుకు 4,15,901 ధరఖాస్తులకు సంబంధించి 11,67,827 మంది లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో వారం రోజుల్లో వెరిఫికేషన్ జరిపించి అర్హులైన వారి జాబితాను పంపించాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో 1,454 చౌక ధరల దుకాణ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో భర్తీ చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ధాన్యం కొనుగోళ్లల్లో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టించిందని మంత్రి తెలిపారు. ఈ వానాకాలం సీజన్ లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా… అంచనాలకు మించి 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లను ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటుందని, ఈ ప్రాసెసింగ్ జోన్ లలో ధాన్యం మిల్లింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version