రణరంగాన్ని తలపిస్తున్న రాయదుర్గం మున్సిపల్‌ పోరు

-

రాయదుర్గం..ఇద్దరు నేతల పుణ్యమా అని రణదుర్గంగా మారుతోంది. ఉన్నతస్థాయిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరిప్తె ఒకరు ఆరోపణలు గుప్పిస్తూ విమర్శలకు దిగుతున్నారు. ఒకరేమో మాజీ మంత్రి.. మరొకరేమో ప్రభుత్వ విప్. ఇద్దరూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీ పార్టీ చివరకు ప్రజాశాంతి పార్టీలా మారుతుందని ఒకరంటే.. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రావని బెదిరిస్తున్నపార్టీ మీదంటూ.. ఆ ఇద్దరు నేతలు చేసుకుంటున్న ఆరోపణలు పీక్ కు చేరాయి. మున్సిపల్‌ ఎన్నికల వేళ ఆ నేతల రచ్చ రాయదుర్గంలో చర్చనీయాంశంగా మారింది.


ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఈ ఇద్దరు నేతల మధ్య వార్ ఒక రేంజ్ లో సాగుతోంది. సహజంగా కాలువ శ్రీనివాసులు టీడీపీ, కాపు రామచంద్రారెడ్డి వైసీపీ కాబట్టి.. వైరం ఉండటం సహజం. మొన్నటి వరకు ఎన్నికలు లేకపోయినా.. వారు ఈ స్థాయిలోనే విమర్శలు చేసుకుని వేడి రాజేశారు. ఎన్నికలు లేనప్పుడే అలా ఉంటే.. ఇక ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో అనుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే అదే జరుగుతోంది. ఇద్దరు నేతలు ఒకర్ని మించి ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

రాయదుర్గం మున్సిపాలిటీలో 32 వార్డులున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక సారి కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీకి చైర్మన్‌ పదవి దక్కింది. ఈ సారి ఎలాగ్తెనా మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దుర్గంలో పంచాయతీ ఎన్నికలప్పుడు ఇద్దరు నేతలు ప్రశాంతంగానే కనిపించారు. కానీ మున్సిపల్ ఎన్నికలు రాగానే సీన్ మారిపోయింది. ఇద్దరు నేతలు వార్డుల్లో తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. రోజూ ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెత్తిపోసుకుంటున్నారు.టీడీపీ నాయకుల మాటలు చూస్తుంటే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ గుర్తుకొస్తున్నారని.. భవిష్యత్తులో టిడిపి స్థాయి ప్రజాశాంతి పార్టీ స్థాయి కన్నా అధ్వానంగా మారబోతుందని ప్రభుత్వ విప్ కాపు ఎద్దేవా చేస్తున్నారు.

వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందని అంటున్నారు టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు. వైసీపీ నేతలు రాయదుర్గంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని.. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాయదుర్గంలో మున్సిపల్ వేడి కంటే ఇద్దరు నేతల మధ్య మాటల వేడే ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
>>

Read more RELATED
Recommended to you

Latest news