ప్రయివేటురంగ బ్యాకులు ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించలేదంటూ ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ.3.95 కోట్ల చొప్పున జరిమానా విధించింది. రుణాలు – అడ్వాన్సులు – చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు, మోసాల వర్గీకరణ, కమర్షియల్ బ్యాంక్ రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐకి ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్లలో ఇద్దరికి గల కంపెనీలకు రుణాలు మంజూరు చేయడంలో నిబంధనలను ఉల్లంఘించిందని ఆర్బీఐ పేర్కొంది.
‘బ్యాంకులకు ఔట్ సోర్సింగ్ సర్వీసులు అందిస్తున్న సంస్థల ప్రవర్తనా నియామవళి, ఇబ్బందులపై’ ఆర్బీఐ మార్గదర్శకాలను కోటక్ మహీంద్రా బ్యాంక్ పట్టించుకోలేదని సెంట్రల్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. తమ సర్వీస్ ప్రొవైడర్ పనితీరుపై వార్షిక సమీక్ష నిర్వహించడంలోనూ కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని తెలిపింది. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు సర్వీసులు అందించడంలో విపలమైందని పేర్కొంది.