ఎల్లుండి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌

-

ఎల్లుండి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌
ప‌దే ప‌దే నిమిషాల్లో పూర్తి

విప్లవాత్మక సంస్కరణతో వ్యవసాయ భూముల సులభతర రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లతో చరిత్ర సృష్టించిన ధరణి పోర్టల్‌ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సన్నద్ధమైంది. రాష్ట్రంలో సెప్టెంబరు 8వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల సేవలు నిలిచిపోయాయి. 75 రోజుల అనంతరం సోమవారం నుంచి ప్రారôభమయ్యే ఈ సేవల్లో పదే పది నిమిషాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ పూర్తికానుంది.

రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహించే ఈ సేవలను హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తిరిగి పునరుద్ధ‌రించనున్నారు. ధరణిలో అందుబాటులోకి తీసుకొస్తున్న రిజిస్ట్రేషన్ల సేవల్లో దస్తావేజుల లేఖరుల అవసరం ఉండదు. ఆస్తి కొనుగోలుదారుడు మీసేవ కేంద్రం నుంచి పూర్తి వివరాలతో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేస్తారు. ఆ సమాచారంతో ఈ-దస్తావేజు రూపుదిద్దుకుంటుంది. ఆస్తి విలువ ఆధారంగా స్టాంపు రుసుం, నిర్వహణ, చలానా తదితర మొత్తాన్ని చెల్లించి స్లాటు బుక్‌ చేసుకోగానే సబ్‌ రిజిస్ట్రార్‌ సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయానికి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సాక్షులతో కలిసి వెళ్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికానుంది. దాని వెంటే యాజమాన్య హక్కులు కల్పన (మ్యుటేషన్‌) పూర్తి చేసి ఇస్తారు. దీంతో గతంలో మాదిరి సదరు స్థానిక సంస్థ వద్ద మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవసరం ఇక ఉండదు. అలాగే ఇప్పటి వరకూ ఉన్న డాక్యుమెంట్లలోని సమాచారాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ చదివి వినిపించే విధానానికి స్వస్తి చెబుతున్నారు. మరోపక్క వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సేవలకు వీలుగా ధరణి పోర్టల్‌లో చేస్తున్న ఆస్తుల సమాచార నమోదు ప్రక్రియ ఆదివారం నాటికి పూర్తికానుంది.

రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహించిన కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌కు బదులు ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో మున్ముందు ఎటువంటి తప్పులు చోటుచేసుకోకుండా సబ్‌ రిజిస్ట్రార్లకు శిక్షణ ప్రారంభించారు. దీని నిర్వహణ, తలెత్తే లోపాలను విశ్లేషించి సరిచేయడానికి సచివాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ రోజుకు పది వరకు నమూనా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను రెవెన్యూశాఖ నిర్వహిస్తున్న నేపథ్యంలో పనిభారం తగ్గిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను రిజిస్ట్రేషన్లు భారీగా జరిగే కార్యాలయాల్లో విలీనం చేయనున్నారు. ఇప్పటి వరకు 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని తొలగించి బండ్లగూడ, ఘట్కేసర్‌, సంగారెడ్డి, వరంగల్‌, మేడ్చల్‌, మహేశ్వరం ప్రాంతాల్లోని కార్యాలయాల్లో విలీనం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news