అధిక బరువును తగ్గించుకునే విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. వయస్సు పెరిగే కొద్దీ బరువు తగ్గడం కష్టతరమవుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. నిజానికి ఏ వయస్సులో ఉన్నవారైనా సరే డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తే కచ్చితంగా బరువు తగ్గవచ్చు. అధిక బరువు తగ్గేందుకు వయస్సు అనేది అడ్డంకి కాదు.. అవును, సైంటిస్టులు ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.
యూనివర్సిటీ ఆఫ్ వార్‌విక్, యూనివర్సిటీ హాస్పిటల్స్ కావెంట్రీ, వార్‌విక్‌షైర్ ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్ లకు చెందిన పరిశోధకులు 2005 నుంచి 2016ల మధ్య 242 మందిపై పరిశోధనలు చేశారు. వారిలో 60 ఏళ్ల వయస్సు కన్నా తక్కువగా ఉన్నవారిని ఒక గ్రూపుగా, 60 ఏళ్లకు మించి వయస్సు ఉన్నవారిని ఇంకో గ్రూపుగా విభజించారు. వారందరూ స్థూలకాయంతో బాధపడుతున్నవారే కాగా వారికి ప్రత్యేక డైట్‌ను పాటించమని, వ్యాయామం చేయమని చెప్పారు. దీంతో వారు అలాగే చేశారు.
ఈ క్రమంలో రెండు గ్రూపుల వారు దాదాపుగా ఒకే రకంగా బరువు తగ్గారని తేల్చారు. అందువల్ల బరువు తగ్గేందుకు వయస్సు అనేది అడ్డంకి కాదని, కేవలం యుక్త వయస్సులో ఉన్నవారు మాత్రమే బరువు తగ్గుతారని, వృద్ధాప్యంలో ఉన్నవారు బరువు తగ్గలేరని అనుకుంటే పొరపాటు పడినట్లేనని సైంటిస్టులు తెలిపారు. పోషకాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేస్తే ఏ వయస్సులో ఉన్నవారైనా అధిక బరువును తగ్గించుకోవచ్చని, అందుకు వయస్సు అనేది అవరోధం కాదని చెబుతున్నారు.