కరోనా మహమ్మారి ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం 22వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు రికవరీ రేటు పెరుగుతున్నా కరోనా కేసులు భారీగా నమోదవుతుండడం అందరినీ కలవరపెడుతోంది. అయితే ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం ఇంకా తమకు ఏమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ జాగ్రత్తలను అస్సలు పాటించడం లేదు. అలాంటి వారికి అవగాహన కల్పించడం కోసం మదురైలోని ఓ రెస్టారెంట్ వినూత్న ప్రయోగం చేసింది. అదేమిటంటే…
మదురైలోని టెంపుల్ సిటీ అనే ఓ రెస్టారెంట్ కరోనా మాస్కుల రూపంలో ఉండే పరోటాలను తయారు చేసింది. రెస్టారెంట్‌కు చెందిన కేఎల్ కుమార్ వాటిని రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదురై వ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్ లాక్‌డౌన్ అమలవుతుందని, ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంచేందుకే ఈ పరోటా మాస్కులను తయారు చేశామని తెలిపారు. ప్రస్తుతం అనేక మంది కరోనా జాగ్రత్తలు పాటించడం లేదని, మాస్కులను ధరించడం లేదని, అందుకనే అలాంటి వారిలో ఈ వైరస్ పట్ల చైతన్యం కలిగించడం కోసమే ఈ పరోటా మాస్కులను తయారు చేశామని తెలిపారు.
కాగా తమిళనాడులో ప్రస్తుతం అనేక చోట్ల లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ముంబై, ఢిల్లీ అనంతరం తమిళనాడులోనే భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో అనేక చోట్ల లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.