కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో బుధవారం (08-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఈ ఏడాది ఎట్టి పరిస్థితిలోనూ ఐపీఎల్‌ను నిర్వహించి తీరుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. టీ20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే… తాము ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వల్ల దేశంలో ఐపీఎల్ జరిగే పరిస్థితి లేకపోతే ఇతర దేశాల్లోనైనా ఐపీఎల్‌ను నిర్వహిస్తామని తెలిపారు.
2. కరోనా వైరస్ ను కట్టడి చేయకపోతే 2021 మార్చి వరకు ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల మందికి కరోనా సోకుతుందని, 18 లక్షల మంది చనిపోతారని ప్రఖ్యాత ఎంఐటీ యూనివర్సిటీ సైంటిస్టులు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయలేకపోతే ఆ వైరస్ వల్ల ఎంత మంది చనిపోతారో సరిగ్గా అంచనా వేయడం కష్టమన్నారు.
3. ప్రపంచ క్రికెట్ చరిత్రలో 143 ఏళ్లలో తొలిసారిగా స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. దాదాపుగా 117 రోజుల కరోనా విరామం అనంతరం ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా వెస్టిండీస్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు బుధవారం ప్రారంభమైంది. మొత్తం ఈ సిరీస్‌లో ఇరు దేశాలూ 3 టెస్టు మ్యాచ్‌లను ఆడనున్నాయి.
4. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమస్యపై చర్చించారు. రాష్ట్రానికి సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కరోనాకు అవసరమైన వెంటిలేటర్లు, పీపీఈ కిట్లతోపాటు ఆర్థిక సహాయాన్ని కూడా కేంద్రం తెలంగాణకు అందజేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.
5. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేశారు. ఈ మేరకు ఆ టోర్నీని రద్దు చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. అదే సమయంలో బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలోనే ఆ టోర్నీని రద్దు చేసినట్లు తెలుస్తోంది.
6. కరోనా నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని మరో 5 నెలల వరకు పొడిగించారు. దీంతో దేశంలోని 81 కోట్ల మంది ప్రజలకు లబ్ధి కలగనుంది. ఈ పథకం కింద పేద కుటుంబాల్లో ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమలు, ఒక్కో కుటుంబానికి 1 కేజీ కందిపప్పును ఇవ్వనున్నారు.
7. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య బుధవారానికి 1,19,81,313కు చేరుకుంది. మొత్తం 5,47,324 మంది కరోనా వల్ల చనిపోయారు. 69,25,830 మంది కోలుకున్నారు. భారత్‌లో 7,46,506 కేసులు నమోదు కాగా, 20,684 మంది చనిపోయారు.
8. హైదరాబాద్‌లో బోనాల పండుగను ప్రజలు ఇండ్లలోనే జరుపుకోవాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. బోనాలతో భక్తులు దేవాలయాలకు రాకూడదన్నారు. ఇళ్లలోనే పండుగను జరుపుకోవాలని అన్నారు.
9. కరోనా బారిన పడ్డవారిలో మెదడు పనితీరు దెబ్బ తింటుందని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. అక్యూట్ డిసెమినేటెడ్ ఎస్‌సిఫలోమైలిటీస్ (ఏడీఈఎం) అని పిలిచే వ్యాధి బారిన పడేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు తేల్చారు.
10. కరోనా బాధితులు ఉండే ప్రదేశంలోని గాలిలోనూ వైరస్ కణాలు ఉంటాయని.. దాంతో ఆ ప్రదేశంలోకి వెళ్లే వారికి కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని పలువురు సైంటిస్టులు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఓ అధ్యయనాన్ని పంపిన విషయం విదితమే. అయితే ఈ విషయం నిజమే అయి ఉండవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. అయినప్పటికీ దీనిపై ఆ సంస్థ ఇంకా ప్రకటన చేయలేదు.