గ్రేటర్ లో ఆ ఒక్క డివిజన్ తీర్పు పై హైకోర్టులో రేపు కీలక విచారణ

-

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర గుర్తులున్నా వాటినీ లెక్కించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన సర్క్యులర్‌పై రేపు విచారణ జరుగనుంది. కాగా ఎస్ఈసి జారీ చేసిన ఉత్తర్వులు నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఇదే అంశం పై నేరేడ్ మెట్ కౌంటింగ్ పై బీజేపీ అభ్యర్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

జిహెచ్ఎంసి కౌంటింగ్ సందర్భంగా స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర ఏ గుర్తులు ఉన్నా వాటన్నింటినీ లెక్కించాలని ఎస్ఈసి ఇచ్చిన సర్క్యులర్ వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హౌజ్ మోషన్ లో భాగంగా విచారించిన న్యాయస్థానం ఎస్ఈసి ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దింతో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించబోమని తేల్చిచెప్పింది. బ్యాలెట్‌ పేపర్‌పై ఏ గుర్తులు ఉన్నా లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత కోరుతూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.

ఎన్నికల సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల కొన్ని కేంద్రాల్లో ఓటర్లకు స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర గుర్తులను ఇచ్చి తప్పిదం చేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులతో ఒక డివిజన్‌ ఫలితాలు మాత్రమే ఆగిపోయాయని, రేపు ఈ కేసును సింగిల్‌ జడ్జి మొదటి కేసుగా విచారించనున్న తరుణంలో అభ్యంతరాలుంటే అక్కడే చెప్పుకోవాలని సూచించింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేరెడ్‌మెట్‌ డివిజన్‌ మినహా మిగతా 149 డివిజన్లలో లెక్కింపు పూర్తయింది. నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు సూచించింది.ఏ గుర్తు ఉన్నా ఆ బ్యాలెట్‌ పేపర్లను కూడా లెక్కిం చాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీచేయడం నిబంధనలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. కాగా రేపు ఉదయం మరోసారి ఈ కేసు విచారణకు రానుంది.

స్వస్తిక్‌ గుర్తుకు బదులుగా పోలింగ్‌ కేంద్రం నంబర్‌ సూచించే గుర్తులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్‌పై ఏ రకమైన గుర్తులు ఉన్నాయనే విషయంలో స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల కమిషన్‌ను కౌంటర్‌ దాఖలు చేయాలని సింగిల్‌ జడ్జి ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news