కరోనా బాధితులకు చికిత్స అందించడం కోసం గచ్చిబౌలిలో 1500 పడకలతో నిర్మించిన కోవిడ్ ఆస్పత్రికి కాంగ్రెస్ ఎంపీ రూ. 50 లక్షలు ఇచ్చారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయిస్తున్నట్టు చెప్పారు. బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఇందుకు సంబంధించిన లేఖను అందజేశారు. ఈ విషయాన్ని రేవంత్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ నిధులతో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద మురికినీటి శుద్ధి ప్లాంట్(సీవరేజ్ ప్లాంట్)ను నిర్మించాలని కోరారు. వీలైనంత త్వరగా ప్లాంట్‌ను నిర్మించాలని కోరారు.
కాగా, తెలంగాణ సర్కార్ గచ్చిబౌలిలోని స్పోర్స్ట్ కాంప్లెక్స్‌ని కోవిడ్ ఆస్పత్రిగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. ఇక్కడ అన్ని రకాల ఆధునాతన సదుపాయాలు కల్పించారు. అయితే ఇక్కడ సీవరేజ్ ప్లాంట్ నిర్మించకపోవడంతో.. అందులో నుంచి వచ్చే మురుగు నీరు పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి చేరుతుందని విద్యార్థులు తెలిపారు. ఈ సమస్యను సోషల్ మీడియా వేదికగా అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
హెచ్‌సీయూ విద్యార్థుల సమస్యపై స్పందించిన రేవంత్.. తన ఎంపీ ల్యాడ్స్ నిధులు నుంచి కోవిడ్ ఆస్పత్రి వద్ద సీవరేజ్ ప్లాంట్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నేడు జిల్లా కలెక్టర్‌కు లేఖ అందజేశారు.