దళితబంధు ( Dalit Bandhu Scheme )…ఇప్పుడు తెలంగాణ రాజకేయాల్లో హాట్ టాపిక్ అయిన పథకం. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా సీఎం కేసీఆర్ దళితబందు అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకునే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ పథకంలో భాగంగా ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
మొదట ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌లోనే అమలు చేయడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆ తర్వాత రాష్ట్రమంతా పథకాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ పథకం దెబ్బ ప్రతిపక్షాలకు గట్టిగా తగులుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. దళితబంధుని ప్రతిపక్షాలు ఎక్కడా వ్యతిరేకించడం లేదు. అదే సమయంలో ఈ పథకం రాష్ట్రమంతా అమలు చేయాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి.
రేవంత్ రెడ్డి అయితే దళితులతో పాటు, గిరిజనులకు కూడా ఈ పథకం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మిగిలిన 118 నియోజకవర్గాల్లోని దళితులు, గిరిజనులకు పథకం ఇవ్వాలని పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే దళితబందు ద్వారా పది లక్షలు ఇవ్వడం మంచిదే అని, కానీ కేసీఆర్ దళితులకు ఇచ్చిన మూడెకరాల హామీ కింద రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్ల విలువని కూడా చేర్చి, ఒక్కో దళిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో బీసీలకు కూడా న్యాయం చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. దళితబందు పథకం కింద అంత పెద్ద ఎమౌంట్ ఇస్తుండటంతో బీసీల్లో కూడా ఆశలు మొదలవుతున్నాయి. ఇప్పుడు ఇదే పథకం వల్ల కేసీఆర్‌పై బీసీల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. ఏదేమైనా దళితబందు పథకమే కేసీఆర్‌కు మైనస్ అయ్యేలా కనిపిస్తోంది.