సర్పంచులకు నిధుల సమస్యపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నాకు పీసీసీ పిలుపునిచ్చింది. ఇందిరా పార్కు వద్ద ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనికితోడు… కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పెద్ద సంఖ్యలో పోలీసులు నేతల ఇళ్ల వద్ద మొహరించారు. నాయకులెవరూ ఇంటి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు రేవంత్ యత్నించడంతో.. పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేసి కారులో ఎక్కించుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ధర్నాకు వెళ్లేందుకు యత్నించగా.. అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో రేవంత్.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా? అని నిలదీశారు.
మరోవైపు గాంధీభవన్ వద్ద పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ధర్నాచౌక్‌కు వెళ్లేందుకు యత్నించిన నేతలను అడ్డుకున్నారు. పోలీసుల అడ్డగింతతో గేటు దూకేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.