అమానుషం.. రెండు నెలల చిన్నారిని ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి పడేసిన తల్లి

-

గుజరాత్​ అహ్మదాబాద్​లో అమానవీయ ఘటన జరిగింది. ఓ మహిళ తన రెండు నెలల చిన్నారిని ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందకు పడేసింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

ఆనంద్ జిల్లాకు చెందిన ఆసిఫ్ మియా మాలెక్ అనే వ్యక్తితో ఫర్జానాబానుకు వివాహమైంది. రెండు నెలల క్రితం ఈ దంపతులకు ఆడపిల్ల జన్మించింది. చిన్నారికి పుట్టినప్పటి నుంచే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వడోదరలోని ఓ ఆస్పత్రిలో 24 రోజుల పాటు ఉంచి చికిత్స చేయించారు. అయినా చిన్నారి ఆరోగ్యం కుదుటపడకపోవడం వల్ల వైద్యుల సిఫార్సు మేరకు నడియాడ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల అహ్మదాబాద్ గవర్నమెంట్ ఆస్పత్రికి అంబులెన్స్​లో తరలించారు.

అహ్మదాబాద్​ ప్రభుత్వాస్పత్రిలో మూడో అంతస్తులోని చిన్నపిల్లల వార్డులో చిన్నారి చికిత్స పొందుతోంది. ఆదివారం వేకువజామున 5 గంటలకు ఫర్జానాబాను.. వెయిటింగ్ రూమ్‌లో నిద్రిస్తున్న భర్తను లేపింది. చిన్నారి కనిపించట్లేదని అతడికి చెప్పింది. ఆ తర్వాత కూతురు కోసం ఇద్దరు వెతికారు. ఎంతకీ కనిపించకపోవడం వల్ల పోలీసులకు ఫోన్ చేశాడు ఆసిఫ్​. అలాగే ఆస్పత్రి సెక్యూరిటీకి సైతం ఫిర్యాదు చేశాడు.

ఆస్పత్రిలో సిబ్బంది వార్డులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. అందులో ఫర్జానాబాను ఉదయం 4.15 గంటలకు చిన్నారిని తీసుకుని బయటకు వెళ్లినట్లు రికార్డైంది. ఆమె వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావడం కనిపించింది. దీంతో ఆమెను పోలీసులు విచారించగా.. అసలు విషయం బయటపడింది. తన కుమార్తె పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోందని నిందితురాలు పోలీసులకు చెప్పింది. అందుకే ఆమెను ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందికు పడేసి హత్య చేశానని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news