ధరణి పోర్టల్ ఓ మాఫియాగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ మనుషులు ధరణి మాఫియా వెనుక ఉన్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యక్తిగత సమాచారం దేశాలు దాటి పోతోందని తెలిపారు. దీని ద్వారా పేదల భూములు లాక్కునే కుట్ర జరుగుతోందని చెప్పారు. 2024 జనవరి 1న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందన్న రేవంత్.. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
ధరణి పోర్టల్‌తో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. దీని వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఇవాళ ధరణి అదాలత్ క్యాంపెయిన్ పేరిట కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ధరణి వల్ల రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పరిష్కరం చేస్తామని హామీ ఇచ్చారు.