హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 3 రోజులు క్రితం కోకాపేట భూములు వేలం వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు రేవంత్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కోకాపేట భూములను సందర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది.
ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి కోకాపేటకు బయల్దేరేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. తెల్లవారు జాము నుంచే భారీగా మోహరించిన పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు-రేవంత్ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రేవంత్ రెడ్డి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రేవంత్ రెడ్డి ఎంపీగా పార్లమెంట్ సమావేశాల్లో కేసీఆర్ అవినీతిని లేవనెత్తుతారనే ఆయనను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేత మల్ల రవి అన్నారు. రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం అప్రజస్వామికమన్నారు. ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.