తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది. నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలో నూతన ఉత్సాహం కనబడింది. అయితే, రేవంత్ చీఫ్‌గా నియామకం తర్వాత వచ్చిన తొలిగా రాబోయేది ఉప ఎన్నికనే. కాగా, ఏ మేరకు రేవంత్ కాంగ్రెస్ పార్టీని అక్కడ నిలబెట్టబోతున్నాడు? కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇచ్చేందుకు ఎంత ప్రయత్నించబోతున్నారు? అనే చర్చ ఆ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ శాతంగా ఉన్న దళితుల ఓట్లు తమ వైపునకు తిప్పుకునేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. కాగా, ఇందుకు కౌంటర్ అటాక్‌గా రేవంత్ ఏం చేయబోతున్నారంటే..
కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను ఆగస్టు 9న సమర శంఖం పూరించబోతున్నాడు రేవంత్. ‘దళిత బంధు’కు కౌటర్ అటాక్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత, గిరిజన హక్కుల కోసం దండోరా మోగించేందుకు ప్రణాళికలను ఇప్పటికే రచించాడు రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలోనే కేవలం హుజురాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ‘దళిత బంధు’ స్కీమ్ అమలు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా కాకుండా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల ఎదుట చావు డప్పు కొట్టనున్నట్లు తెలిపారు. మొత్తంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌పై స్పష్టమైన కార్యచరణతో పోరాటం చేయబోతున్నది రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దళితులకు రూ.10 లక్షలు ఇచ్చే విషయమై ప్రకటనలు మాత్రమే కాకుండా ఆచరణలో ఉండేందుకు గాను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయబోతున్నది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రణాళికలను రచించుకుంటున్నది అని చెప్పొచ్చు.