రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ నగరంలోని కోవిడ్ పేషెంట్లకు శుభవార్త చెప్పింది. నగరంలో ఉన్న రోటరీ చల్లా బ్లడ్ బ్యాంక్‌లో ది రోటరీ ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కాగా ఆదివారం ఈ ప్లాస్మా బ్యాంక్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
కోవిడ్ ఎమర్జెన్సీ స్థితిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల వారు త్వరగా కోలుకుంటున్నారు. అలాగే ప్రాణాపాయం కూడా తప్పుతోంది. అయితే వారికి చాలా త్వరగా ప్లాస్మా అందుబాటులో ఉండేందుకు గాను ప్లాస్మా బ్యాంక్‌లు ఎంతగానో తోడ్పడుతాయి. మరోవైపు పేదలకు ఈ బ్యాంక్‌లు ఎంతో సహాయకారిగా ఉంటాయి. అందువల్లే రోటరీ క్లబ్ ఈ ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
కాగా రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ ఇప్పటికే దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తూ తలసేమియా వ్యాధి బారిన, ఇతర వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఉచితంగా రక్తాన్ని అందిస్తోంది. అందులోనే కొత్తగా ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించనున్నారు. దీంతో నగరంలో కోవిడ్ పేషెంట్లకు త్వరగా ప్లాస్మా అందుతుంది.