మార్చి 20, 2019 నుంచి ఏప్రిల్ 30, 2019 తేదీల మధ్య తయారైన బుల్లెట్, బుల్లెట్ ఎలక్ట్రా వాహనాల్లో బ్రేక్ కాలిపర్ బోల్టు సరిగ్గా పనిచేయడం లేదని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన మోటార్ సైకిళ్లు అంటే.. దర్జాకు, విలాసానికి మారుపేరుగా ఉంటాయి. వాటి నుంచి వచ్చే సైలెన్సర్ సౌండ్‌కే చాలా మంది ఫిదా అయిపోయి ఆ బైక్‌లను కొనుగోలు చేస్తుంటారు. ఆ కంపెనీకి చెందిన ఒక్కో మోటార్ సైకిల్ ఒక్కో శైలిని కలిగి ఉంటుంది. అలాగే ఒక్కో బైక్‌లో మనకు లభించే ఫీచర్లు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ కంపెనీ బైక్‌ల ధరలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇప్పటికే అనేక మోడల్స్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు మనకు అందుబాటులో ఉన్నాయి.
అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలు అంటే అవి ఇతర టూవీలర్లలా కాదు. నాణ్యతకు, మన్నికకు మారుపేరుగా ఉంటాయి. కానీ ఆ కంపెనీకి చెందిన 7వేల బుల్లెట్, బుల్లెట్ ఎలక్ట్రా వాహనాల్లో మానుఫాక్చరింగ్ లోపం తలెత్తింది. దీంతో ఆ మొత్తం మోటార్ సైకిళ్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ వెనక్కి పిలిపించినట్లు తెలిపింది. ఆయా వాహనాల్లో మానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉండడం వల్లే వాటిని వాడుతున్న వినియోగదారులకు వాహనాలను వెనక్కి తేవాలని చెప్పామని… రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించింది.
మార్చి 20, 2019 నుంచి ఏప్రిల్ 30, 2019 తేదీల మధ్య తయారైన బుల్లెట్, బుల్లెట్ ఎలక్ట్రా వాహనాల్లో బ్రేక్ కాలిపర్ బోల్టు సరిగ్గా పనిచేయడం లేదని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది. అందుకనే ఆయా వాహనాల్లో సమస్యలు వస్తున్నాయని ఆ కంపెనీ పేర్కొంది. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా బ్రేక్ కాలిపర్ బోల్ట్స్ లేవని, దీంతో వాటిని సరిచేసేందుకు వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నామని.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది. ఈ క్రమంలోనే ఆ వాహనాలకు ఉచిత సర్వీస్ చేస్తామని కూడా ఆ కంపెనీ వెల్లడించింది..!