రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేనలతో బీజేపీ కలయికపై ఎటువంటి సందేహాలను పెట్టుకోవలసిన అవసరం లేదని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కుటుంబ సమేతంగా కలిసే అవకాశం టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీందర్ కుమార్ గారికి లభించిందని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని అధ్వాన శాంతి భద్రతల పరిస్థితులను రవీంద్ర కుమార్ గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని కాపాడ వలసిందిగా కోరారని తెలిపారు.
దానికి ప్రధానమంత్రి గారు స్పందిస్తూ అవును… ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి పంజాబ్ మాదిరి గానే ఉన్నదని వ్యాఖ్యానించడం ద్వారా రవీందర్ కుమార్ గారి వాదనలతో ఆయన ఏకీభవించినట్లయిందని, ప్రధానమంత్రి గారితో ఏదో ఒకటి మాట్లాడి బయటకు వచ్చి మా పార్టీ పెద్దల మాదిరిగా బిల్డప్పులు ఇచ్చే రకము రవీందర్ కుమార్ గారు కాదని, ప్రధానమంత్రి గారు తన మనసులో ఉన్న మాటను, రవీందర్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించడం ద్వారా చెప్పకనే చెప్పారని అన్నారు. ఒకవేళ ఆయనకు రవీందర్ కుమార్ గారి మాటలు ఇష్టం ఉండి ఉండకపోతే, సబ్జెక్టు డైవర్ట్ చేసి ఉండేవారని తాను పలువురితో మాట్లాడినప్పుడు పేర్కొన్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.
రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేసే అవకాశాలు ఉండగా, వారితో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా జతకట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, జనసేనతోనే తమ పొత్తు ఉంటుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి మాటల్లోనూ తప్పులేదని అన్నారు. జనసేనతో బీజేపీ కలిసి పని చేయాలనుకుంటుండగా, టీడీపీతో జనసేన కలిసి పని చేసేందుకు ఆసక్తిని చూపుతుందని, టీడీపీ, జనసేన, బిజెపి కలిస్తే మాడు పగులుతుందని, బాక్స్ బద్దలవుతుందని, కొంప కొల్లేరవుతుందన్న ఆందోళనలో తమ పార్టీ పెద్దలు ఉన్నారని తెలిపారు.