తెలంగాణ ఆర్టీసీ కార్మిక నాయకుడు అశ్వత్థామ రెడ్డి పేరు తెలియని వారు ఇప్పడు తెలంగాణలో ఉండరు.. అంతగా పాపులర్ అయ్యాడతను.. 47 వేల మంది కార్మికులను ఏకతాటిపై నడుపుతున్నాడు. అసలు ఈ అశ్వత్థామరెడ్డి ఎవరు.. ఓసారి పరిశీలిద్దాం.. ఈ అశ్వత్థామరెడ్డి ఇప్పుడు.. కేసీఆర్ కు దీటుగా గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ.. ఈయన ఒకప్పుడు కేసీఆర్ పెంచిన నాయకుడే.
గతంలో ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉండేది. ఇప్పటికీ ఉంది. కానీ దాని నాయకత్వం ఏపీకి చెందినవారు ఉండేవారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణకు కూడా సొంత యూనియన్ ఉండాలన్న ఉద్దేశ్యంతో అశ్వత్థామ రెడ్డి తెలంగాణ మజ్దూర్ యూనియన్ అంటూ సొంత కుంపటి పెట్టాడు. తెలంగాణ జోరులో అది సక్సస్ అయ్యింది.
అప్పటి నుంచి ఆయన కేసీఆర్ అనుయాయుడిగానే ఉంటూ వచ్చాడు. అయితే ఓ ఏడాది నుంచి అశ్వత్థామరెడ్డికి టీఆర్ఎస్ కు సంబంధాలు చెడిపోయాయి. ఆర్టీసీలో యూనియన్ నాయకులను బోర్డు మెంబర్లుగా తీసుకోవడం ఆనవాయితీ.. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఆ పని చేయలేదు. దీంతో అశ్వత్థామరెడ్డికి కేసీఆర్ పై అసంతృప్తి పెరిగింది.
గత ఎన్నికల సమయంలోనూ అశ్వత్థామ రెడ్డికి ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించాడు. కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని భావించాడు. కానీ ఏదీ రాలేదు. దీంతో అశ్వత్థామరెడ్డికి కేసీఆర్ పై పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు సమ్మె సమయంలో ఈ క్లాషెస్ మళ్లీ బయటపడుతున్నాయి. మరి ఎవరిది పై చేయి అవుతుందో..?