ఏడాదికి పైగా ఉక్రెయిన్ తో యుద్ధం సాగిస్తున్న రష్యా భారీగా సైనిక, ఆయుధ సంపత్తిని కోల్పోయింది. ఇప్పుడు వాటిని సమకూర్చుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఉత్తర కొరియాతో ఓ డీల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటునన ఉత్తర కొరియాతో.. తమకు ఆయుధ సహాయం చేస్తే.. అందుకు బదులుగా ఆహార ధాన్యాలను అందజేస్తామని రష్యా ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా ఆరోపించింది.
‘ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యా సైన్యానికి ఉత్తర కొరియా సహాయం చేయడంపై ఆందోళనకరం. అదనపు మందుగుండు సామగ్రి కొనుగోలు చేసేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మాకు సమాచారం. ఉత్తర కొరియాకు బృందాన్ని పంపించాలని చూస్తోంది. ఆయుధ సహాయానికి బదులుగా ఉత్తర కొరియాకు రష్యా ఆహారాన్ని అందజేస్తోందని మాకు తెలిసింది’ అని అమెరికా జాతీయ భద్రతా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, రష్యాకు ఆయుధాలు అమ్మడం, సరఫరా చేయమని ఇటీవల ఉత్తరకొరియా చేసిన ప్రకటననూ గుర్తు చేశారు. ఒకవేళ ఉత్తర కొరియా-రష్యా మధ్య ఆయుధ ఒప్పందం జరిగితే మాత్రం అది ఐరాస భద్రతా మండలి నియమాలకు విరుద్ధమని తెలిపారు.