రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇక ముగింపుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలు రష్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, అమెరికా, కెనడా, జపాన్ వంటి దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈనేపథ్యంలో ఇరు దేశాలు కూడా చర్చలకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వినాశనానికి తెరపడాలంటే చర్చలే సరైన మార్గమని భారత్ తో సహా అన్ని దేశాలు భావిస్తున్నాయి.
తాజాగా రష్యా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఏ.ఎఫ్.పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దు దేశం బెలారస్ లో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా తెలిపినట్లు సమాచారం. అయితే బెలారస్ దేశంలోె చర్చలకు ఉక్రెయిన్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. బెలారస్ ను లాంచ్ ప్యాడ్ గా వాడుకుని రష్యా తమపై యుద్ధం సాగిస్తుందని.. ఉక్రెయిన్ విమర్శిస్తోంది. రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నా, బెలారస్‌లో కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారని AFP న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. చర్చల కోసం వార్సా, బ్రాటిస్లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బాకు వంటి నగరాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రతిపాదించినట్లు AFP న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.