తమ దేశంపై రష్యా బలగాల దాడులను ఉక్రెయిన్ సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో సైనికులు, ఆ దేశ అధ్యక్షుడు ఏ మాత్రం తొణకడం లేదు. రష్యా కుట్రలను, కుతంత్రాలకు అంతే దీటుగా బదులిస్తున్నారు. ఇక ఉక్రెయిన్ తమ భూభాగాలను కాపాడుకోవడానికి తెగించి పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఖేర్సన్ నగరం తమ నియంత్రమలోకి వస్తున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని తెలిపింది. స్థానికంగా ఎవరైనా రష్యా సైనికులు ఉంటే.. వెంటనే లొంగిపోవాలని సూచించింది. తమ సేనలు దాదాపు 41 ప్రాంతాలను విముక్తి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలగుతున్నట్లు రష్యా సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు మాస్కో వెల్లడించింది. నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. సిబ్బందితోపాటు ఆయుధ సామగ్రిని నిప్రో నది తూర్పు తీరంవైపు తరలించినట్లు పేర్కొంది.
రష్యా బలగాలు వైదొలగడాన్ని ఉక్రెయిన్ ‘కీలక విజయం’గా అభివర్ణించింది. ప్రజల సందడి, నగరవ్యాప్తంగా ఉక్రెయిన్ జెండాలు వెలిసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.