ఏపీలోనూ ఓ శబరిమల.. కేరళ బ్రాహ్మణులతో మణికంఠునికి పూజలు

-

ఇరుముడులు స్పృషియించి శుభమనుచు దీవించి.. జనబృందములు చేరె జగమేలు స్వామి.. స్వామియే శరణమయ్యప్ప. మణికంఠేశ్వర స్వామి.. హరహరపుత్రుడు.. అయ్యప్ప స్వామి.. ఇలా ఏ పేరుతో పిలిచినా పలికుతాడు ఆ పార్వతీపుత్రుడు. ప్రతిఏటా చాలా మంది అయ్యప్ప మాల వేసుకుంటారు. నిష్ఠగా పూజలు చేస్తూ కేరళలోని శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామికి ఇరుముడులు సమర్పిస్తారు.

కానీ కొంతమంది ఆర్థిక, ఆరోగ్య, ఇతర కారణాల వల్ల శబరిమలకు వెళ్లలేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప భక్తులకోసం ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో అయ్యప్ప సేవాసమాజం వారు శబరిమలను తలపించేలా అయ్యప్పస్వామి గుడి నిర్మించారు. ఇక్కడి మణికంఠుడికి కేరళ పూజారులే పూజలు నిర్వహిస్తున్నారు.

నెల్లూరుకి ఓ వైపున రంగనాయకులు గుడి, మరోవైపున అయ్యప్ప గుడి ఉంటాయి. అయ్యప్పగుడి సెంటర్ అంటే నెల్లూరులో బాగా ఫేమస్. అయితే ఈ ఆలయానికి మరో అరుదైన విశిష్టత కూడా ఉంది. సహజంగా అయ్యప్ప మాల ధరించే భక్తులు శబరిమలలో ఇరుముడి చెల్లిస్తారు. కానీ ఏపీలో కూడా ఇరుముడి సమర్పించే అతి కొద్ది ఆలయాల్లో నెల్లూరు అయ్యప్ప గుడి కూడా ఒకటి.

1987లో కేరళ తంత్రులతో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఏటా ఇక్కడ మండల పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప మాల ధారణ సమయంలో భక్తులు జిల్లా నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు. మాల ధరించిన స్వాములకు నిత్యాన్నదానం ఉంటుంది. జిల్లానుంచి బయలుదేరే అయ్యప్పస్వాములంతా ఈ ఆలయం వద్ద ఆగి, స్వామిని దర్శించుకుని తమ యాత్ర మొదలు పెట్టడం ఆనవాయితీ.

ఏపీలోని అయ్యప్ప స్వామి ఆలయాలన్నింటి కన్నా నెల్లూరులో ఉన్న ఈ అయ్యప్ప గుడికి ఓ విశిష్టత ఉంది. శబరిమల ఆలయంలాగే ఇక్కడ కూడా ఉపాలయాల నిర్మాణం ఉంది. పదునెట్టాంబడి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ప్రధాన ఆలయంలో కేరళ తంత్రులు మాత్రమే పూజలు నిర్వహిస్తుంటారు. ఉపాలయాల్లో స్థానిక పూజారులుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే సంతానం లేనివారికి ఆ అదృష్టం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

Read more RELATED
Recommended to you

Latest news