సాగర్ ఉపఎన్నికలో‌ జానారెడ్డి తెరవెనుక మాంత్రంగం వీరిదేనా

-

తెలంగాణ కాంగ్రెస్‌కు నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో పార్టీలో కీలక నాయకులు అక్కడ మోహరించారు. బరిలో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి గెలుపుకోసం పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తోంది పీసీసీ. నాగార్జునసాగర్‌లో తిరిగి పాగా వేయాలన్నది జానారెడ్డి లక్ష్యం. వయసు పైబడినా టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న జానాకు అన్ని తామై నడిపిస్తున్న తనయుల పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.


సాగర్ లో కాంగ్రెస్ ప్రచారం సమన్వయం విషయంలో పార్టీ తీరంతా ఒక ఎత్తు అయితే.. జానారెడ్డి ఇద్దరు కుమారులు రఘువీర్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు మరో ఎత్తు అని చెబుతున్నారు నాయకులు. జానా రెడ్డి కూడా… పార్టీ నేతల సలహాల కంటే…కుమారులు ఇస్తున్న సూచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట జానా. తండ్రి మనసు ఎరిగిన వాళ్లు కావడంతో సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారట. కరోనా నుంచి కోలుకున్న ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం తనకు అప్పగించిన పెద్దవూర మండలంపై ఫోకస్‌పెట్టారు. జానారెడ్డి కుటుంబంతో ఉన్న బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని గట్టిగానే పనిచేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సుదీర్ఘకాలంగా జానారెడ్డి రాజకీయాల్లో ఉన్నా ఈ ఉపఎన్నికలో మాత్రం ఆయన తనయులపై పూర్తిస్థాయిలో ఆధారపడ్డారట. వారే అంతా చూసుకుంటున్నారట. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని రఘువీర్‌ ప్రయత్నించారు. అక్కడ కొంత వర్క్‌ కూడా చేసుకున్నారు. కానీ చివరిలో సమీకరణాలు మారపోయాయి. రఘువీర్‌కు టికెట్‌ రాలేదు. ఇప్పుడు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో పోటీకి తొలుత జానారెడ్డి ఆసక్తి కనబర్చలేదు. దీంతో రఘువీర్‌ పేరు చర్చల్లోకి వచ్చింది. చివరకు కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాలతో జానారెడ్డి పోటీకి దిగక తప్పలేదు.

జానారెడ్డి వయసు పైబడింది. ఎండలు దంచి కొడుతున్నాయి. అధికారపార్టీ నుంచి గట్టి పోటీ ఉంది. మరో వైపు బీజేపీ నుంచి పోటి.. దీంతో జానారెడ్డి ఇద్దరు కుమారులు ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారట. హాలియా మండలంలో ప్రచారాన్ని జయవీర్‌ పర్యవేక్షిస్తుంటే.. నియోజకవర్గంలో మిగిలిన వ్యవహారాలన్నీ రఘువీర్‌ కనుసన్నల్లో జరుగుతున్నాయట. సాగర్‌కు వచ్చిన నాయకులను సమన్వయం చేసుకోవడం.. పార్టీ ప్రచారం తీరుతెన్నులు స్థానిక నాయకులు బుజ్జగింపులు..ఇలా ప్రతి విషయంపైనా చర్చిస్తున్నారట. జానారెడ్డి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నాన్నకోసం అన్నీ తామై పనిచేస్తున్నట్టు చెబుతున్నారు.

ఇటీవల జరిగిన హాలియా జనగర్జన మొదలుకొని.. ప్రచారం, వచ్చిన నేతల మంచి చెడులు రఘువీర్‌, జయవీర్‌ చూస్తున్నారట. ఇన్నాళ్లు ఒంటి చేత్తో రాజకీయాల్లో చక్రం తిప్పిన తండ్రికి కుడి, ఎడమ భుజంగా మారారట. అయితే ఈ ఉపఎన్నిక జానారెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులకు, కాంగ్రెస్‌పార్టీకి పరీక్షగా మారింది. సాగర్ పరీక్షలో జానారెడ్డి కుటుంబం ఏ మేరకు సక్సెస్ అవుతుందో‌ చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news