సినిమాలు లేదా యూట్యూబ్‌లో ఏవైనా వీడియోలు చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సందర్భాల్లో మనకు ఎక్కడ లేని కోపం వస్తుంటుంది.
సినిమాలు లేదా యూట్యూబ్‌లో ఏవైనా వీడియోలు చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సందర్భాల్లో మనకు ఎక్కడ లేని కోపం వస్తుంటుంది. ఇక షియోమీకి చెందిన స్మార్ట్‌ఫోన్లలో అయితే ఈ యాడ్స్‌కు కొదువే ఉండదు. ఫోన్‌లో మొబైల్ డేటా ఆన్ చేస్తే చాలు.. ఏ యాప్ ఓపెన్ చేసినా.. మనకు యాడ్స్ దర్శనమిస్తుంటాయి. ఈ విషయంపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా.. షియోమీ మాత్రం ఆ యాడ్స్‌ను ప్రదర్శించడం అలాగే కొనసాగిస్తోంది. అయితే ఇకపై శాంసంగ్ కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నట్లు తెలిసింది.
ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఇకపై తన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల్లో సిస్టమ్ యాప్స్‌ను ఓపెన్ చేసినప్పుడు యూజర్ మొబైల్ డేటా లేదా వైఫైకి కనెక్ట్ అయి ఉంటే.. ఆయా యాప్స్‌లో ఆటోమేటిగ్గా యాడ్స్‌ను ప్రదర్శించాలని చూస్తున్నదట. ఈ మేరకు శాంసంగ్ అక్టోబర్ 1వ తేదీన యురోపియన్ యూనియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్‌లో శాంసంగ్ మొబైల్ యాడ్స్ క్యాంపెయిన్ పేరిట ఓ నూతన ట్రేడ్ మార్క్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసింది. అందుకు అనుమతి లభించాక.. శాంసంగ్ తన డివైస్‌లలో యాడ్స్‌ను ప్రదర్శించనుంది.
అయితే స్మార్ట్‌ఫోన్లు లేదా ట్యాబ్లెట్ పీసీల్లో సిస్టమ్ యాప్స్‌ను ఓపెన్ చేసినప్పుడు నిజానికి యాడ్స్ కనిపిస్తే ఎవరికైనా సరే తీవ్ర అసహనం వస్తుంది. ఈ క్రమంలో షియోమీ ఈ విషయంలో వినియోగదారుల నుంచి చాలా వరకు అపఖ్యాతిని మూటగట్టుకుంది. షియోమీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందంటూ ఇప్పటికీ చాలా మంది యూజర్లు ఆ కంపెనీని తిట్టిపోస్తున్నారు. మరి శాంసంగ్ కూడా అదే బాటలో నడవనుండడంతో ఇక ఆ కంపెనీ ఫోన్లను వాడేవారు ఎంతటి ఆగ్రహావేశాలకు లోనవుతారో చూడాలి. ఏది ఏమైనా.. ఇలా స్మార్ట్‌ఫోన్లలో యాడ్స్ ఇవ్వడం అంటే.. అది నిజంగా వినియోగదారులను తీవ్ర అసహనానికి గురి చేసే విషయమే. మరి శాంసంగ్ ఈ విషయంలో పునరాలోచన చేస్తుందో, లేదో చూడాలి..!