సాధారణంగా ఒక దేశానికి ప్రధాన మంత్రి కావడం అంటే.. చాలా తక్కువ వయస్సు ఉండగానే ఆ పదవి చేపట్టడం ఎవరికీ అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు. అంతకు ముందు ఎన్నో పదవులు చేపట్టి, బాగా వయస్సు అయిపోతే తప్ప ఎవరూ ప్రధాని పదవిని చేపట్టరు. అయితే ఫిన్‌లాండ్‌కు చెందిన ఆ మహిళ మాత్రం చాలా తక్కువ వయస్సులోనే ప్రధాని అయి ప్రపంచ రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే చాలా తక్కువ వయస్సులో ప్రధాని అయిన వ్యక్తిగా పేరు గాంచింది. ఇంతకీ ఆమె ఎవరంటే…
ఫిన్‌లాండ్‌కు చెందిన 34 ఏళ్ల సన్నా మారిన్ ఆ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆమె అక్కడ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక ఫిన్‌లాండ్‌లోని అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేతగా ఆమెను ఆ పార్టీ నేతలు ప్రధానిని చేశారు. ఈ క్రమంలోనే ఆమె డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే ప్రపంచంలోనే చాలా చిన్న వయస్సులో ప్రధాని అయిన వ్యక్తిగా మారిన్ రికార్డులకెక్కారు. అంతకు ముందు ఉక్రెయిన్ ప్రధాని ఒలెక్సీ హొంచారుక్ (35 ఏళ్లు) పేరిట ఆ రికార్డు ఉండేది. ఈ క్రమంలో ఆ రికార్డును మారిన్ బద్దలు కొట్టారు.
కాగా హొంచారుక్‌కు ముందు న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డర్న్ (39 ఏళ్లు) ఆ రికార్డు నెలకొల్పారు. అయితే మారిన్ తాను ప్రధాని అయినా ఏమాత్రం ఆడంబరత, గర్వం ప్రదర్శించకుండా.. హుందాగా వ్యవహరించారు. తాను ప్రధానిని అవుతానని ఎన్నడూ అనుకోలేదని, తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని.. ఆమె తెలిపారు..!